వ్రాసినది: సురేష్ | ఫిబ్రవరి 20, 2010

Lightning Thief..మాయాబజార్.. MNIK..

థాకరేకు ఈ విషయము తెలిస్తే నాకు తప్పకుండా మరాటీ ఆనరరీ సిటిజెన్ షిప్ ఇస్తాడు. వాలంటైన్ డే గురించి పట్టించుకోకుండా(థాకరే నుంచి చప్పట్లు), ముప్పై మైళ్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, పక్క తియేటర్లో MNIK (మై నేమ్ ఈజ్ ఖాన్ ) సినిమా ఆడుతున్నా పటి్టంచుకోకుండా (బహిష్కరించి) మాయాబజార్ సినిమా చూసాము. మాతో పాటు మరో నలుగురు మిత్రులూ వారి కుటుంబాలు గూడా. వావ్!! ఆయనకు అంత కన్నా ఇంకా కావలిసినది ఏమున్నది?

ఈ బృహత్తు కార్యక్రమము చేపట్టడానికి నేను చాలానే శ్రమ పడాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఓ వారము రోజులు పైనే పట్టింది. ఇది బోరింగ్ బ్లాక్ అండ్ వైట్ సినిమా కాదు, అదీ కాకుండా ఆ ఫన్నీ ఫుడ్ సాంగ్కూడా ఉంది ఈ సినిమాలో అని మా అమ్మాయికి హైప్ ఇచ్చాను. అది కొంత వరుకు పని చేసింది. ఏదైనా సాధించాలను కున్నప్పుడు కొంచెము ఇచ్చి పుచ్చుకోవాలి అనే సూత్రాని్న మా అమా్మయితో బాగా వాడాను. చిరంజీవి సినిమాను కూడా ఎప్పుడూ నేను మొదటిరోజు మొదటాట చూడలేదు. అలాంటిది తన కోసము “Lightning thief” అనే ఓ గొప్ప ఆంగ్ల, విథలాచార్య సినిమా చూసాను. ఏ మాటకామాటే చెప్పు కోవాలి. ఆ సినిమా ఓ మాదిరిగా బాగానే ఉంది. నేను సినిమాలో ఎక్కడ నిద్ర పోతానో అని నాకు ముందే అందులో ఉండే గ్రీకు పౌరాణిక పాత్రలు, వాటి మద్య ఉండే సంబంధాలు అన్నీచక్కగా విడమరిచి చెప్పింది. ‘గ్రీకు ఇంద్రుడి (Zeus) వజ్రాయుధాన్ని ఎవడో అనామకుడెత్తుకు పోవటమేమిటి?’ లాంటి నా చొప్పదంటు ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానాలు చెప్పింది. “క్విడ్ ప్రో క్వోగా నేను (నిరసనల మధ్యన) బలరాముడెవరు, అభిమన్యుడికి తనకి సంబంధమేంటి, శశిరేఖను బావ ఎందుకు పెళ్లి చేసుకోవచ్చు లాంటి అనేక విషయాలు విడమరిచి చెప్పాను (అనుకున్నాను).

ఈ విధముగా మాంచి సన్నాహలతో మాయాబజార్ సినిమాకి వెళ్లాము. సినిమాహాలు షుమారుగా నిండటము చూసి ఆనందము వేసింది. తెలుగులోని అత్యద్భుతమైన చిత్రరాజాన్ని మొదటిసారి విడుదలైనప్పుడు చూసే అవకాశము లేకపోయినా ఇప్పుడైనా చూడగలుగుతున్నందుకు మామిత్రులందరికీ మహదానందమైనది. సినిమా బాగుంటుందా లేదా, రంగులు ఎబ్బెట్టుగా ఉంటాయా (లవకుశలో లాగా) లాంటి సందేహాలు ఉన్నాయి. పిల్లలలో కొంచెము అసహనము కనబడుతూనే ఉంది.

ఓకసారి సినిమా మొదలైనాక ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు మాయబజారు చూసినా ఆ అనుభవాలన్నీ ఈవర్ణభరితమైన కొత్త మాయాబజార్ ముందు దిగదుడుపే. మేలిమి బంగారానికి మరింత వన్నె వచ్చింది. తెరమీద మొదటి సారి కృష్ణుని చూసినప్పుడూ, ఘటోత్కచుడు పద్యము పాడుతూ ప్రవేశించినప్పుడూ, ఈలేయటము కూడా రాని నా అశక్తత మీద నాకే కోపము వచ్చింది. ఓ ఇద్దరు ముగ్గురు నుంచి ఈల సౌండ్ రావటము కొంతలో కొంత రిలీఫ్. పోతే ఈ సినిమా గురించి నా విశ్లేషణ :-

  1. ఈ సినిమాకి మీ భార్యను తీసుకెళ్లేట్టైతే ముందుగానే హెచ్చరిక. మొదటి రెండు పాటలు అయిపోయాక తీసుకెళ్లండి. ఎందుకు చెపుతున్నానో అర్థము చేసుకోండి. ఆ సీన్లలో ఆడవారు వేసుకున్న వడ్డణాలు, గొలుసులు (ఇంకా మరెన్నో నాకు తెలియని ఆభరణాలు), పట్టుచీరలు.. వామ్మో.. ఆ తరవాత మీ ఇష్టము.
  2. బలరాముడు పాత్ర ధారి గుమ్మడి, .ఎన్.అర్, ఎస్.వి.అర్ అద్భుతముగా ఉన్నారు.. కొత్త రంగులలో. వాళ్ల నటన మరింత సహజముగా అనిపించినది. ఛాయాదేవి మరెన్నో రెట్లు గడుసుగా (పాత్రోచితముగా) కనపడింది.
  3. రమణా రెడి్డ, రేలంగి పాత్రలు ఇంకా నవ్వు తెప్పించేట్టుగా అనిపించాయి. దానికి సాక్షము కేరింతలు కొడుతూ చూసిన మా మిత్రుల పిల్లలు.
  4. సావిత్రి నటన, రూపము అదుర్స్. క్లోజప్ షాట్లు కంటే కొంచెము దూరము నుంచి మరింత బాగుంది.
  5. సందేహానికి తావు లేకుండా, అరిసెలు, లడ్లు, బూరెలు, పులిహోర, పాయసము, కజ్జుకాయలు చక్కగా కనబడ్డాయి.. వివాహ భోజనంబు పాటలో. ఘటోత్కచుడు అంత హడావిడిగా ఆ భోజనము ఎందుకు తిన్నాడో ఇప్పుడు బాగా అర్థ మయ్యింది.
  6. బాక్ గ్రౌండ్ లో ఉండే నటులూ, ఎగష్ట్రాలూ మంచి మంచి రంగు బట్టలు వెయ్యటము మూలాన కొంచెము వాళ్లకు ప్రాముఖ్యత పెరిగినట్టు అనిపించినది.
  7. నాకు చాలా disappointing గా అనిపించినది మాత్రము.. నిస్సందేహముగా.. నా అబిమాన నటుని పాత్ర. శ్రీ కృష్ణుడు, నీల మేఘశ్యాముడు. కరక్టే. కానీ మరీ ఇంత నీలమా? చాలా అసహజముగా అనిపించినది. నాకు B&W కృష్ణుడే బాగున్నాడు.

టూకీగా.. మీరు గనక ఇది వరుకు మాయాబజారు సినిమా ఒకటి కంటే ఎక్కవ సారు్ల చూసిఉంటే (అంటే మీరు పంకాలైతే) ఎంత ప్రయాసలకోర్చి అయినా ఈ కలర్ వర్షన్ తప్పకుండా చూడాలి. నా మటుకు నేను, రంగుల పాతాళభైరవి, సీతారామకళ్యాణం, రంగులులేని లవకుశ కోసము ఎదురుచూస్తున్నాను.

కొసమెరుపు.. మా అమ్మాయికి కూడా ఈ సినిమా ఓ మాదిరిగా బాగానే నచ్చినది.

వ్రాసినది: సురేష్ | ఫిబ్రవరి 12, 2010

డాలస్ లో స్నో శివరాత్రి



ఎప్పుడూ లేనిది మా వూరిలో ఇవాళ స్నో ఇరగ దీసింది. షుమారు ఒక అడుగు పడి ఉండొచ్చు అంటున్నారు. మంచు తో కప్పబడి   తెల్లగా, అందముగా ఉన్న భూమిని చూస్తుంటే ఈ చిన్న పద్యము వచ్చింది..


వాహనము, సహవాసము, వాసము, కురు
లనెల వంక, మైపూత తెల్లగ మెరిసెడి
ధవళ ప్రియునీ శివరాత్రి నాడు గొలువ
ధవళ వస్త్రము గట్టెను ధరణి మాత

వ్రాసినది: సురేష్ | డిసెంబర్ 31, 2009

ఓ తెలగోడి గోడు

ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్ధితిని చూసి ఓ నిస్సహాయుడైన తెలుగు వాడు పడే ఆవేదనకు మరో రూపము పొద్దు లో ప్రచురితమైన ఈ నా కవిత. స్పందనగా మీ బాణాలు నామీద ఎక్కుపెట్టేముందు, మరొక్కసారి చదవండి. తప్పకుండా అందులో చాలా మంది నాలాంటి వాళ్ల ఆవేదన మీకు కనపడుతుంది. రాష్ట్రము విడి పోవాలా, వొద్దా అనే సంగతి గురించి ఇక్కడ నేను చర్చించటము లేదు. ఆ విషయము గురించి చాలా పేజీల చర్చ ఇప్పటికే జరిగినది. మనమందరము తెలుగు వాళ్లము, ఎంత తృణీకరించినా మనందరికి ఒక ఉమ్మడి సంస్కృతి ఉంది. అలాగే మనకు చాలా ఉమ్మడి సమస్యలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్నిటికి రాష్ట్ర విభజన జరిగితే పరిష్కారము దొరకవచ్చేమో నాకు తెలియదు. కానీ తప్పకుండా మిగతా చాలా సమస్యలకు  ఇది పరిష్కారము కాదు.

వ్రాసినది: సురేష్ | అక్టోబర్ 26, 2009

తానా, ఆటా సంఘాలకో విజ్ఞప్తి

తానా, ఆటా సంఘాలకో విజ్ఞప్తి

డాలస్ లో వైభవంగా టెక్సాస్ తెలుగు సాహితీ సదస్సు.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్  అనబంధ తెలుగు సాహిత్య వేదిక 23వ సాహితీ సదస్సును నెల నెల తెలుగు వెన్నెలకార్యక్రమంతో మిళితం చేసి నిర్వహించారు. సుమారు 100 మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు..  ”

ఆంధ్రజ్యోతి article కు లంకె

ఇది ఆంధ్ర జ్యోతి దినపత్రికలో మొన్న ప్రచురితమైన ఓకానొక వార్త లోని మొదటి కొన్ని వాక్యములు. ఇండియాలో ఈ news  itemచదివే వారికి, ఆహా ప్రవాసాంధ్రులకు సాహిత్యము అంటే ఎంత అభిమానము అనుకునేట్టుగా ఉంది. “ఎవరో గోపిచంద్ అంట (ఏరా నీకు తెలుసా ఎవరో?), తన శత జయంతి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చెశారంట”, అని కూడా అనుకోవచ్చు. ఆ మేరకు ఈ కార్యక్రమము తన ఆశయము సాధించినదనే చెప్పాలి. దానిని నిర్వహించిన నా మిత్రుని కూడా ఎప్పటిలా అభినందించాలి (ఆంధ్రజ్యోతి కధనములో అతని పేరు మిస్ అయ్యింది, అది వేరే సంగతి).

కానీ ఇంకా లోతుగా విశ్లేషిస్తే మరో కోణము బయటపడుతుంది. ఈ కార్యక్రమము జరగటానికి ముందు రోజు, ఇదే డాలస్ లో, మరో ప్రోగ్రాము జరిగినది. 1500 మంది హాజరయ్యారు. మహా వైభవముగ వేడుకలు జరిగాయి. మహిళలకు తమ తమ latest fashion డ్రస్సులు, పట్టు చీరలు ప్రదర్శించే అవకాశము దొరికింది. ఎప్పటిలాగే, ABCDపిల్లలకు మరో boring దేశీ ప్రోగ్రాము  చూడక తప్పింది కాదు. మగ వారికి, వాళ్లకు సంబంధించిన గొప్పలు (సొల్లు) చెప్పుకునే అవకాశము captive audience ద్వారా చిక్కినది. అందరూ హాపీసు..

అదేంటో మరుసటి రోజు జరిగిన ఈ సాహితీ కార్యక్రమానికి మాత్రము అందులో పట్టు మని పదో వంతు మంది కూడా రాలేదు. నా అంచనా ప్రకారము  ఇరవై ముప్పై మంది కూడా హాజరై చూసి ఉండరు. మొదటి programకి అంత ఎక్కువ మంది ఆసక్తి గా  ఎందుకు వచ్చారో నేను చెప్పాల్సిన అవసరము లేదనుకుంట. మీరు ఊహించే ఉంటారు. మొన్నామధ్య డాలాస్ లో, అవధానము సందర్భముగ, రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు మన సినిమా సంస్కృతి మీద, అశువుగ అద్భుతమైన satirical పద్యమొకటి చెపితే దానికి  retortగా  సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినిమా పరిశ్రమ ఏ విధముగ సాహిత్యానికి మేలు చేసిందో  చక్కగా వివరించారు. నాకు అప్పుడు తట్టలేదు గాని ఇప్పుడు బాగా బోధ పడింది. శాస్త్రి గారన్నట్లు, ఇక్కడ problemసినీ పరిశ్రమ మూలాన గాదు.

శ్రీశ్రీ కొకు గోపిచంద్ శత జయంతి ఉత్సవాలు, కేతు విశ్వనాధరెడ్డి గారి ఉపన్యాసము, చక్కటి విందుభోజనము, అద్భుతమైన ambience (upscale OMNI downtown hotel), అంతా ఉచితము; అయినా అటెండెన్స్ అంతంత మాత్రము. మనందరము కలిసి తప్పకుండా ఆలోచించ వలసిన విషయమిది. ఎన్నో సంవత్సరాల అనుభవమున్న గౌరవనీయులైన పెద్దలలో ఒకరు, program  success గురించి పొగుడుతూ, “OMNI లాంటి పాష్ లొకేషనులో ఇది జరగటము వలన నా చిరకాల వాంఛ తీరినది, దీనిని సాధ్యపరిచినందుకు తానా నిర్వహనాధికారులకు కృతజ్ఞతలుఅని రాయడము నాకు చాలా ఆశ్చర్యము కలిగించింది. అంటే మన expectationsమరీ అంత అడుగంటాయా? ఎలాంటి లొకేషనులో జరిగింది, యే యే పేవర్లలో, ఎవరెవరి పేరులతో వార్తలు పడింది అనేదే సాహితీ సదస్సు సఫలమవటానికి కొలమానమా?

ఆర్గనైజర్లను కించ పరచటము నా అభిమతము ఎంత మాత్రముగాదు. వారు కార్యక్రమము చాలా చక్కగా నిర్వహించారు. దిగితేనే గాని లోతు తెలియదని, ఒడ్డున నుంచెని ఎన్ని విషయాలైనా సుళువుగా చెప్ప వచ్చనిగూడా తెలుసు. అలా అని మరింత మెరుగు పడే మార్గాలు, ఆలోచనలు ఉన్నా discuss చెయ్యకపోవటము ఎంత మాత్రము అభిలషణీయము కాదు. ఉదాహరణకు కొన్ని:

విశాలాంధ్ర బుక్ హౌస్ లో, మహా ప్రస్ధానం పుస్తకము వెల,  50/- . 100 పుస్తకాల వెల షుమారు $100. మనమెందుకు శ్రీశ్రీ శతజయంతి సంధర్భముగ ఉచితముగా ఇవ్వ లేక పోయాము? Look at how Christian missionaries distribute Bible for free. తీసుకున్న వాళ్లలో కొంత మందన్నా చదవక పోతారా అన్న ఆలోచన. ఈ విధముగ Indiaలో ఎంతో కొంత మందికి జీవనోపాధి కలిగించినట్టు గూడాఉండేది. I would be more than happy to contribute to this sort of thing than to buy one book of Sri Sri (సిప్రాలి) for  an unreasonable price. నా మిత్రునికి, కొకు గొప్పతనము తెలుసు, కాని ఎప్పుడూ కొని చదివే అవకాశము రాలేదు. అతను, తన లాంటి వాళ్లు చాలా మంది తప్పకుండా కొని్న పుస్తకాలు సరసమైన ధరలకు ఉంటే కొనే వారు. ఉచితము అయితే మరీ మంచిది. Instead our organizations are sponsoring ordinary books about movie personalities with prices that are inflated many fold  (like $40 for an autobiography of a famous actor and poet at one of the recent events). ఏమి సాధించాలనుకుంటున్నాము?

పెద్ద ఊరులో, ఎన్నో వనరులు గల TANA, TANTEX లాంటి successful organizations నడుమ, ఇంత మంది ఆశకి్త గల అభిమానులున్నా, ఒక తెలుగు libraryకూడా లేక పోవటము తప్పకుండా లోటే. మనకున్న ఒక అనుకూలమైన విషయము, డాలరు కొనుగోల శక్తి. ఎన్నో గొప్ప పుస్తకాలు, సరైన పద్దతిలో కొంటే చాలా తక్కువ దరలకు పొందవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితము, IIT Kanpur లో, నేను ఒక మిత్రుడు కలిసి, చక్కని libraryని చాలా తక్కువ కాపిటల్ తో వృద్ధిచేసి, నిర్వహించాము. మాలాంటి వాళ్లు చేయగలిగినప్పుడు, తెలుగు organizationకి అంత కష్టము కాకపోవచ్చు.

తెలుగు వచ్చిన మన పరిస్ధితే ఇలా ఉంటే మన పిల్లల timeకి ఎలా ఉంటుందో సులభముగ ఊహించవచ్చు. సిలికానాంధ్ర వారి మన బడిఒక చక్కని ప్రయత్నము. అదే పని ATA, TANA, TANTEX వారు, మరింత grand scaleలో ఎందుకు చేయలేక పోతున్నారు? తప్పకుండా వారు ఆలోచించవలసిన విషయము.

ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉచిత సలహాలు ఇవ్వవచ్చు. నాకు మట్టుకు “Telugu Cultural and Language Glass is half empty”. మీరేమంటారు?


వ్రాసినది: సురేష్ | అక్టోబర్ 18, 2009

దిక్కెవరు

దిక్కెవరు

సకల చరాచర జీవ రాశులందు

మొదటి వరసలో ఏతెంచిన జల చరమును

అందమునకు ఎందరో మీనాక్షుల కనుల

సోయగమునకు పా్రమాణికను

వేదాలు రక్షింపగ ఆ దేవదేవుడే మెచ్చి

ఆది అవతారముగ ధరించిన రూపమును..

అయితేయే..

పరిణామక్రమమున పిదప వచ్చి

నిలబడి గూడ నిలకడ లేని నిర్దయ జీవి

నీటి యందు మునిగి నిమిషమైన తిన్నగ

నిలువలేని సాగలేని మనలేని అల్ప జీవి

తన వంతుగ పైవాడిచ్చిన వనరులతో

తృప్తి పడక అంతా తనదేననే దురాశా జీవి

అన్నదమ్ములు అక్కచెల్లెలు తో కూడి

ప్రశాంతవాసము సాగించెడి నా గూటిలో

మోతలు చేయు మర పడవలు తిప్పుటయె గాక

నిర్లక్ష్యముగ నీటి ఉపరితలమున ఊపిర సలపకుండ

చమురు చిందించెడి సంకుచిత జీవి

అపరిమితమైన తనయాకలి తీర్చుకొను నెపమున

నా సహజ వాసములైన చెరువులను భూములుగ జేసి

వాగులు, సెలయేరులకు అడ్డుకట్టలు వేసి

నాకు నిలువ నీడ లేకుండ జేసిన దురాక్రమణ జీవి

ఎవరిచ్చారు తనకీ అధికారము?

తన విలాసములకు, కారులలో తిరుగుటకు

గాలిలో ఎగురుటకు, ఒకరి నొకరు నరుక్కొనుటకు,

తినుటకు, తిన్నది అరుగుటకు

రకరకాల యంత్రాలు, కర్మాగారాలు.

వాటినుంచి వచ్చు మలినములు

నా ఇంటిలో గుమ్మరించి నా గొంతు నొక్కి

నాకు ఊపిర అందకుండ జేసిన కర్కశ జీవి

భూగోళము వేడెక్కినదట, నీటి మట్టము పెరిగినదట

అంటార్కిటికా మంచు కరిగితే వచ్చిన నీరు కాదది

మౌన రోదనముల దారలుగ కారి కారి

కనిపించకనే ఉప్పు నీట కలిసినట్టి నా కన్నీరు

బాధగ నిట్టూర్పు విడుచుటకు ఉచ్ఛా్వసము తీయలేను

భక్తితో జోడింతు మన్న అయ్యో చేతులైన లేవు

ధ్యానింతు మన్న కను రెప్పలు కూడ ఈయగ నైతివి

మనిషిని మించిన నిర్దయుడవు కదా

ఓ మీనావతారా, ఇంకెవరు దిక్కు నాకు?


వ్రాసినది: సురేష్ | సెప్టెంబర్ 25, 2009

మిత్రునకు ఓ క్రికెట్ కవితా కానుక

మహా కవి శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవిత కనర్హము. దానికి తోడు, ఇప్పుడు Cricket fever కూడా కొంచెము నడుస్తూ ఉంది.  ఈ చిన్న కవిత ఓ క్రికెట్ అభిమాని యైన నా మిత్రుని మొదటి వివాహ వార్షికోత్సవము సందర్భముగా రాయటము జరిగింది. మీరు కూడా చదివి ఆనందిస్తారను కొంటున్నాను.


మొదటి వార్షికోత్సవము

నారసింహునిప్రశాంత జీవన కాసారమున

రజనీప్రియకిరణము్మలు సోక,

కొత్త కలువలు, నెత్తావులు వెదజల్లెను

నిరుడు ఈనాడు

నాడు మొదలయ్యెను క్రికెట్టు మాచి

నూతన జీవితపు తొలి మాచి;

మాచీ అయిన మీ ఇద్దరూ, ఓపెనర్లుగా,

మొదటి సెషను ఆడారు బహు చక్కగా

విధాత విసురు వింత గుగ్లీలను

వినమ్రతతో డిఫెండు చేస్తూ

బాధల బౌన్సర్లను అలవోకగా

బౌండరీలు దాటించుతూ

సుఖాల హాఫ్ వాలీలను సుళువుగా

సిక్సర్ల రూపాన మళ్ళించుతూ

చేరారీ మొదటి డ్రింకు బ్రేకుకు

గడిచేకొద్దీ మారు పిచ్ స్వరూప స్వభావములు,

దాని మీద బ్రతుకు బాలు వింత పొకడలు,

కొత్త కొత్త బౌలర్ల చాలెంజిలు

ఇదే మెలుకువతో ఎదుర్కొనుచూ,

కొండొకచో మిడ్ పిచ్ మీటింగులతో

ఒకరికొకరు చేయూత నిచ్చుకొనుచూ

బాంటరించుతూ, ఆస్వాదించుతూ,

ఎల్లప్పడూ ఉల్లాసముగా సాగించాలి

ఈ జీవన యానము, ఇలాగే సాఫీగా

ఇద్దరున్న ఈ టీములోనికి

మరో ఇద్దరైనా మునుముందు రావాలని

ఇదే విధముగ ఆనందము వెల్లవిరియాలని

మరెన్నో మాచిలు మేము చూడాలని

మనసారా కోరుచున్నాము

మీ ఈ కాజఫాన్స్..

మారుతి మెచ్చిన పండు


నూజివీడు అనగానే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది మామిడి పండు. తింటేనే తెలిసేది, వర్ణించటానికలవికానిది, అద్భుతమైనది ఈ పండు రుచి. మండు వేసవి ఎండ మంటలను సైతము పారద్రోలి మనసును, శరీరాన్ని ఆహ్లాదపరిచే అద్భుత శక్తి  ఈ మామిడి పండు ప్రత్యేకత.

అసలు ఈ పండుకి ఇంత విశిష్టమైన రుచి కలగటానికి కారణాలు ఏమిటి? బహుశ ఇక్కడి గాలిలోనూ, నీటిలోనూ, నేలలోనూ ఆ మహత్తు ఉందేమో? లేకపోతే నూజివీడు వాళ్ళందరూ ఇంత మంచి వాళ్ళు, చక్కని వాళ్ళు ఎందుకు అవుతారు? అంత వరుకు బాగానే ఉంది కానీ ఈ అమృత తుల్యమైన రుచి ఎలా వచ్చింది? దేవతాపుంగవుడెవరో తప్పక ఆశీర్వదించి ఉంటాడు.

ఊరు బయట అడవి ఆంజనేయ సా్వమి గుడి దగ్గిరున్న మారుతి పాదాల గుర్తులు చూస్తే, ఆయన ఇక్కడికి ఎప్పడొచ్చాడు ఏ పని మీద వచ్చాడు అనే ప్రశ్న తప్పకుండా కలుగుతుంది. బహుశ జరిగిన కథ ఇది అయిఉండవచ్చు..


సీ.        రవికుల దీపకులన్ కడుపున మోయు

ధరణిజ మావి ముదమున కోర

గ, వియోగ మోపలేక రఘరాముండు తే

మనిపురమాయించె పవిసుతునకు;

నందన మందు మాకందము కతుకుచు

మారుత నందనుడారుచిని మ

రువగ చేయు ఫలములు వెదకుచు శరవే

గమున పోయె నవాచి కడ తరులకు

ఆ. పులుపు తీపి రుచుల పాలు సమమునుండు

రస రసాలముల రస సుధల రుచి

మెచ్చి తెచ్చె మారుతి, చరిత కెక్కెనా

పండు, నూజివీడు మావి పండు

అది జరిగిన సంగతి. అప్పటికింకా కాంతారావుగారు సీతా దేవిని అడవులలో వదిలీ రాలేదు, రేలంగిగారు ఎఱ్ఱి రాముడు అని అనాలేదు. సీతారాములు అయోధ్యలో సుఖముగా ఉన్నారు. అదిగో అప్పుడు, గర్భవతి సీతమ్మకు మామిడి పండు తినాలని కోరిక కలిగింది. అడిగింది బంగారు లేడి కాకపోయినా మునుపు కలిగిన వియోగము గుర్తుకొచ్చి, శ్రీ రాముడు ఆ బాధ్యతను వాయునందనుడికి అప్పజెప్పాడు. దానికి తోడు, శ్రేష్టమైన పండ్ల గురించి శాఖాచరునికంటే బాగా తెలిసిన వాడు ఎవరుంటారు?

నందన వనములోని మామిడి పండు తింటూ, దానికంటే మధురమైన దానిని తీసుకు రావాలని ఆంజనేయుడు కృష్ణా నదికి దగ్గరలో ఉన్న నూజివీడు తోటలకు హుటాహుటిగా వెళ్ళాడు. అక్కడ పులుపు తీపి రుచులు చక్కగా కలిసిన రసం మామిడి పండు తిన్నాడు.  ఆ రుచిని మించినది మరెక్కడా దొరకటము అసంభవమని, ఆ పండును అయోధ్యకు తనతో తీసుకు వెళ్ళాడు ఆంజనేయుడు. మారుతి మెచ్చిన, సీతా దేవికి నచ్చిన ఆ పండు రుచి అప్పటి నుంచి మరింత పెరిగింది.

. మంటల చిటచిటలు మండెడి ఎండలు

వెట్ట వడకు పిడచగటు్ట నోళ్ళు

వేడి సెగను పిండి వెన్నెల జేసెడి

పండు, నూజివీడు మావి పండు

ఆ. రసములు గలవు పలు రకము, బంగినపలి్ల,

చిక్కమునకు చిక్కు చక్కని  ఫల

ములు, ఇమాము పసదములు, పెక్కు రుచులీను

పండు, నూజివీడు మావి పండు

మండు వేసవి ఎండల తాకిడి తగ్గించే ఈ పండులో రకాలు అనేకము. చిన రసము, పెద్ద రసము, నల్ల రసము, తెల్ల రసము, బంగినపల్లి, జలాలు, ఇమాము పసందులు..ఇలా చెప్పుకుంటూ పోతే దానికంతే లేదు. ఒక దానిని మించిన రుచి మరొక దానికి. అలాగే దోర మామిడి కాయ ఎలా ఉంటుందంటే..

ఆ. లేత పసిమి కోక లే నడుము తొడుము

బిగువు మేని వగల పొగరు వగరు

తొలి వలపు తీపి పులుపు సంగమనమీ

పండు, నూజివీడు మావి పండు

పచ్చటి పట్టు పరికిణి, సన్నటి నడుము, తొలి యౌవనపు బిగువు  పొగరులతో కూడిన కన్నెపిల్లను బోలి ఉంటుంది. అదే పండిన మామిడి పండైతే..

. నౌరు పరువపు తావి, తాకిన విభునకై

విరహిణి వలువములు వీడి నటుల,

అవి కలయిక చేత మాగెనీ కమ్మని

పండు, నూజివీడు మావి పండు

ప్రియుని (ఇక్కడ సూర్యుని ) కలయిక చేత మాగిన పరువాలు కలిగి , ఆతని కోసము తాకినంతనే వలువలు జార్చుటకు సిద్దముగా ఉండే విరహిణి బోలి ఉంటుంది చక్కగా తయారైన నూజివీడు మామిడి పండు.

ఇని్న మాట లెందుకు.. తలుచుకున్నంతనే నా లాటి (కవి) పామరులలో కూడా కవిత్వము పుట్టించ గల గొప్పతనము ఈ కాయ సొంతము. ఇంకా ఆలస్యమెందుకు? వెళ్ళి ఆ పండు తినండి. లేనిచో మీ తల వేయి వక్కలు….ఈ కథ చదివారుగా పరవా లేదులేండి..మీకేమీ అవదు.


వ్రాసినది: సురేష్ | మార్చి 30, 2009

ఆగండి..ఆలోచించండి…ఓటెయ్యండి..

నాడు తమిళనాడు లోని అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశాడు అప్పటి రైల్వే శాఖా మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి . దానిన ఆమోదిస్తూ ప్రదాన మంత్రి నెహ్రూ  “ఈ రాజినామా కేవలము మంచి రాజకీయాలకు ముందు ముందు మార్గదర్శకము (constitutional propriety)గా ఉంటుంది అని ఆమోదించటమైనది, అంతే కాని ఆయన ఈ ప్రమాదానికి బాధ్యుడు అని కాదు”  అన్నారు. మరి ఈనాడు ఆ శాఖ మంత్రి ఎవరండి?

వివిద సంస్థానాలను విలీనము చేసి అఖండ భారతదేశ స్థాపన కావించాడు ఉక్కు మనిషిగా పేరు గాంచిన అప్పటి గృహ మంత్రి పటేల్. దేశ విచ్్ఛిన్నతకు కుట్ర జరుగుతుంటే ప్రేక్షకుడుగా మిగిలాడు ఇప్పటి గృహ మంత్రి మరో పటేల్. 

ఆనాటి శాసన సభలలో కూర్చునేవారు, ప్రకాశం పంతులు, కాళేశ్వరరావు, సుందరయ్య లాంటి మహామహులు . మరి  ఈనాటి  చట్ట సభలలో ఎవరో కాస్త సెలవివ్వండి?

నాటి రాజకీయనాయకులలో అధిక శాతము దేశభక్తులు, నిస్వార్ధపరులు, సంఘసేవకులు, సభ్యత సంప్రదాయము తెలిసిన వారు ఉండే వారు. మరి నేటి వారు?  అసంబ్లీ సమావేశాలు మీరు టీవీ లో చూసే ఉంటారు. మాష్టారు లేనీ మా ఊరి వీధి బడి లోని విద్యార్ధలు ఇంకా ఎకు్కవ సంయమనము, క్రమశిక్షణ పాటిస్తారు.

ఈ విధమైన పరిస్థితులు రావటానకి కారణాలు ఏమిటి అని విశ్లేషిస్తే మూడు విషయాలు బోదపడతాయి :

1) ఈ దుస్థితి కాలక్రమేణా సంభవించిన ఒక పరిణామమే కానీ ఒకటో రెండో రోజులోనో, లేకపోతే నెలలులోనో జరిగినది కాదు. 

2) రాజకీయ నాయకులలో ఏ విధముగ ప్రమాణాలు (standards) పడిపోయాయో అదే విధముగ మనకు వారి పట్ల ఉండే  ఆపేక్ష (expectations) కూడా తగ్గుతూ వస్తున్నాయి. నిరాసక్తత పెరుగుతున్నది. పోలింగ్ శాతము తగ్గుతున్నది.

3) దీనికంతటకు మూల కారణము…ఓటర్లు…అంటే మనము…అంటే మీరు, నేను.. పొద్దు లో ప్రచురితమైన రాజకీయ రైలు అనే నా కథ లో సగటు ఓటరు పాత్ర గురించి ప్రస్థావించటము జరిగింది. నైరాశ్యము పాలు ఎక్కువగా ఉంది అని చాలా మంది మిత్రులు వ్యాఖ్యలు పంపారు. దానికి నా సమాదానము “నా గుండె లోతుల్లోని ఆక్రోశము నుంచి పుట్టినదే ఈ కథ” అని.  

ఒక మంత్రి యొక్కఆస్తులు అనూహ్యముగ పెరిగితే వేరే ఇంకొకడితో పోల్చి అది మామూలే అని సరిపెట్టుకుంటాము. ఒక MLA చనిపోతే అతని భార్యనో కొడుకునో, వారికి అర్హత ఉన్నా లేకున్నా, ఎన్నుకుంటాము. రాజకీయ వారసత్వము గురించి మనకు పెద్ద పట్టింపు లేదు. ఒక మంత్రి సోదరుడో, బావమరిదో ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వోద్యోగిని Tvలు సాక్షిగా అవమానిస్తే, అది మనకు రెండు రోజులు మాత్రమే వార్త. మన expectations అడుగంటాయి అనటానకి ఇంత కంటే ఉదాహరణలు ఇంకా  ఏమి కావాలి?

అలాగే పోలింగ్ 60 శాతము మించటం లేదు. ఆ 40 శాతములో కనీసము సగానికి కారణము నిరాసక్తత. “ఏ రాయి అయితే ఏమి పళ్ళు ఊడి పోయేటప్పడు” అనే ఒక భావము. వారితో సంభాషణ ఈ విధముగా ఉంటుంది.

   నేను  : ఎందుకు ఓటెయ్యలేదు? 

   వారు : ఎవరికి వెయ్యమంటావు? అందరూ ఒకటే తానులో ముక్కలే.

   నేను :  ఆ నాలుగో వాడికి వెయ్యి.

   వారు : ఉపయోగము లేదు. అతను గెలవడు.

   నేను :  …..   మౌనము  ……

కానీ APలో ఇప్పడు మిణుకు మిణుకుమనే ఒక చిన్న ఆశ.  ఒక చిన్న అవకాశము; లోక్ సత్తా పార్టీ ద్వారా. మిత్రులారా దానిని వాడుకుందాము. మన మీద పడ్డ ఆ ధన, కుల నిందలను తుడిచేద్దాము. ఈ కుళ్ళు రాజకీయాలను ప్రశ్నించే హక్కు సంపాదిద్దాము. 

ఆ 60 శాతము ఓటర్లలో మీరూ ఒకరైతే సంయమనముతో మీ హక్కు వాడండి. పళ్ళు రాలటము అనివార్యమైనప్పుడు మెత్తని రాయి వాడటము మంచిది కదా? మీరు ఆ మిగిలిన 40 శాతములోని వారైతే, మీ ఓటు వృధా పరచకుండా లోక్ సత్తాకు వేయండి. గెలిచినా ఓడినా మిగిలిన Main Stream పార్టీలకు ఒక సందేశము పంపిన వారు అవుతారు. వచ్చే ఎలక్షన్ లోనైన అవనీతిపరులకు టిక్కెట్టు ఇచ్చేముందు ఆ పార్టీల వాళ్ళు కొంచెము ఆలోచిస్తారు. పోతే, మీరు కూకట్ పల్లి ఓటర్లైతే తప్పక JP కి వెయ్యగలరు.

ఏ మహాప్రస్థానానికైనా మొదలు ఒక చిన్న అడుగే. గమ్యము చాలా దూరమని ఆ మొదటి అడుగుని విస్మరించకండి.

Disclaimer : నేను లోక్ సత్తాపార్టీ అభిమానినే గాని  అభ్యర్దిని కాను. నాకు Monetary benefit ఎంత మాత్రము లేదు.

వ్రాసినది: సురేష్ | మార్చి 23, 2009

సమకాలీన రాజకీయ పరిస్థితి

ఈ పాలిటిక్స ఎంత కుళ్ళి పోయింది? మన రాజకీయనాయకులు ఎంత అవనీతి పరులు? మన దేశం ఏమవుతుంది ఈలాంటి అమాత్యులు ఏలుతుంటే? అని రోజూ కాఫీ తాగుతూ, పేపరు చూస్తూ నిట్టూర్చటము, ఆ తర్వాత మన దైనందిన కార్యక్రమములలో మునిగి పోవటము మన కలవాటే. ఈ వెదవ పాలిటిక్స మనకెందుకు అని పట్టించుకోము కూడా. 

కాని ఈ పరిస్థితికి కారణము ఎవరు? 
బాద్యత ఎవరిది? 
నీది, నాది. 
కాదంటారా?

సమకాలీన రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఎన్నికలలో సగటు వోటరు పోషిస్తున్న పాత్రను, పొద్దులో ప్రచురితమైన నా కథ, రాజకీయ రైలు లో చదువ గలరు. ఓ చదువరి పేర్కొన్నట్లు, కథలో కొంచెము నైరాశ్యం కనిపించినప్పటికీ, వాస్తవం అందుకు విరుద్ధంగా లేదన్నది గమనార్హం.

వ్రాసినది: సురేష్ | మార్చి 12, 2009

మా అబ్బాయికి తెలుగు అస్సలు రాదు

“మీరు నమ్మరుగానీ మా అబ్బాయికి తెలుగు అస్సలు రాదండి” గర్వముగా చెప్పింది లక్ష్మి పక్కింటి సుజాతతో. మొన్నకి మొన్న మా అమెరికా చెల్లెలి పిల్లలు వస్తే వాళ్ళతో ఇంగ్లీషు తప్పితే తెలుగు ఒక్క ముక్క మాట్లాడితే వొట్టు. అదేంటో వొదినా ఆ పిల్లలు మాత్రము వీడితో ఎంతసేపూ వచ్చీ రాని తెలుగులోనే మాట్లడటానికి చూశారు.ఏంటో అమెరికా వెళ్ళినా కొన్ని కొన్ని పిచ్చి అలవాట్లు మాత్రము పోలేదు వాళ్ళకి.

ఈ తరహా సంభాషణలు నాకు ఊహ తెలిసినప్పటినుండీ వింటూనే ఉన్నాను. కానీ బాధాకరమైన విషయము ఏంటంటే, ఈ వింత పోకడ రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఆంగ్లేయులు దేశాన్ని వదిలి అరవయేళ్ళు పైబడినా, రెండు తరాలు గడిచినా, మనకు మట్టుకు అది ఇప్పటికీ గొప్ప భాషే…దొరలు మట్లాడే భాషే.

నా చిన్నప్పుడు, మా తాతగారు (కన్యాశుల్కం నాటకములో గిరీశములా), తెల్లవాడికి సంబందించినవన్నీ (భాషతో సహా) ఎంత గొప్పవో చెపుతూ ఉండేవారు. ఉదాహరణకి Londonనుంచి వచ్చే సిమెంటు (మన నాసిరకము దానిలా కాక) బస్తాళ్ళో ఉండగానే రాయిలా గెడ్డ కట్టుకుపోయేదంట. “అదేంటి తాతగారు సిమెంటుకు ఆ గుణము అస్సలు ఉండగూడదు కదా?” అని నేను అమయాకముగా అడిగితే ఆయన, “నీకేమీ తెలియదురా, నువ్వుండు ఈకాలపు చదువులే ఇంత మారోజులలో ఐతేనా..” అని ఇంకెక్కడికో వెళ్ళిపోయేవారు.

అంతదాకా ఎందుకు మన భాష గొప్పదనము గురించి ఒక తెల్లదొర చెప్పేవరకు మనము నమ్మామా? Telugu is the Italian of the East అని C.P.Brown చెప్పి రెండు శతాబ్దాలు గడిచాయి. మనమూ చక్కగా ఆ విషయము మర్చిపోయాము. అసలు గుర్తుంచుకోవటానికి మనకు అవకాశము ఉంటే గదా. మన పిల్లలు తెలుగు పుస్తకాలు చదువుతుంటే గద? (TVలు చూస్తూ అసలు పుస్తకాలే చదవటము లేదు అది వేరే సంగతి). ఆ టీవీలలో, సినీమాళ్ళో కూడా ఏరికోరి తెలుగు రానివాళ్ళు, వచ్చినా దానిని అంగ్ల ఉచ్చారణతో మట్లాడేవాళ్ళను మాత్రమే చూస్తున్నము.

ఈ విదముగా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉదాహరణలు.
దీనికి పరిష్కారము ఏమిటి?
మన భాష క్రమేణా ఇలా క్షీణించి పోవలసినదేనా?
నా పరిదిలో నేను ఏమి చెయ్యగలను?
ప్రభుత్వము ఏమి చెయ్యగలదు?

ఇంగ్లీషు నేర్చుకోవద్దు, ఇంగ్లీషులో మాట్లాడవద్దు అని కాదు ఇక్కడ భావము. In fact we should all learn and excel in English which is the default medium all around the world. దానికి తోడు కొంచెము మన భాష గురించి కూడా గొప్పగా చెప్పుకుందాము.

మరో టపాలో ఈ సమస్య పరిష్కారం గురించి చర్చిద్దాము. ఈలోపు మీ అభిప్రాయములు తెలుపగలరు.

Older Posts »

వర్గాలు