వ్రాసినది: సురేష్ | జూన్ 5, 2009

నూజివీడు మామిడి పండు..మారుతి మెచ్చిన పండు..

మారుతి మెచ్చిన పండు


నూజివీడు అనగానే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది మామిడి పండు. తింటేనే తెలిసేది, వర్ణించటానికలవికానిది, అద్భుతమైనది ఈ పండు రుచి. మండు వేసవి ఎండ మంటలను సైతము పారద్రోలి మనసును, శరీరాన్ని ఆహ్లాదపరిచే అద్భుత శక్తి  ఈ మామిడి పండు ప్రత్యేకత.

అసలు ఈ పండుకి ఇంత విశిష్టమైన రుచి కలగటానికి కారణాలు ఏమిటి? బహుశ ఇక్కడి గాలిలోనూ, నీటిలోనూ, నేలలోనూ ఆ మహత్తు ఉందేమో? లేకపోతే నూజివీడు వాళ్ళందరూ ఇంత మంచి వాళ్ళు, చక్కని వాళ్ళు ఎందుకు అవుతారు? అంత వరుకు బాగానే ఉంది కానీ ఈ అమృత తుల్యమైన రుచి ఎలా వచ్చింది? దేవతాపుంగవుడెవరో తప్పక ఆశీర్వదించి ఉంటాడు.

ఊరు బయట అడవి ఆంజనేయ సా్వమి గుడి దగ్గిరున్న మారుతి పాదాల గుర్తులు చూస్తే, ఆయన ఇక్కడికి ఎప్పడొచ్చాడు ఏ పని మీద వచ్చాడు అనే ప్రశ్న తప్పకుండా కలుగుతుంది. బహుశ జరిగిన కథ ఇది అయిఉండవచ్చు..


సీ.        రవికుల దీపకులన్ కడుపున మోయు

ధరణిజ మావి ముదమున కోర

గ, వియోగ మోపలేక రఘరాముండు తే

మనిపురమాయించె పవిసుతునకు;

నందన మందు మాకందము కతుకుచు

మారుత నందనుడారుచిని మ

రువగ చేయు ఫలములు వెదకుచు శరవే

గమున పోయె నవాచి కడ తరులకు

ఆ. పులుపు తీపి రుచుల పాలు సమమునుండు

రస రసాలముల రస సుధల రుచి

మెచ్చి తెచ్చె మారుతి, చరిత కెక్కెనా

పండు, నూజివీడు మావి పండు

అది జరిగిన సంగతి. అప్పటికింకా కాంతారావుగారు సీతా దేవిని అడవులలో వదిలీ రాలేదు, రేలంగిగారు ఎఱ్ఱి రాముడు అని అనాలేదు. సీతారాములు అయోధ్యలో సుఖముగా ఉన్నారు. అదిగో అప్పుడు, గర్భవతి సీతమ్మకు మామిడి పండు తినాలని కోరిక కలిగింది. అడిగింది బంగారు లేడి కాకపోయినా మునుపు కలిగిన వియోగము గుర్తుకొచ్చి, శ్రీ రాముడు ఆ బాధ్యతను వాయునందనుడికి అప్పజెప్పాడు. దానికి తోడు, శ్రేష్టమైన పండ్ల గురించి శాఖాచరునికంటే బాగా తెలిసిన వాడు ఎవరుంటారు?

నందన వనములోని మామిడి పండు తింటూ, దానికంటే మధురమైన దానిని తీసుకు రావాలని ఆంజనేయుడు కృష్ణా నదికి దగ్గరలో ఉన్న నూజివీడు తోటలకు హుటాహుటిగా వెళ్ళాడు. అక్కడ పులుపు తీపి రుచులు చక్కగా కలిసిన రసం మామిడి పండు తిన్నాడు.  ఆ రుచిని మించినది మరెక్కడా దొరకటము అసంభవమని, ఆ పండును అయోధ్యకు తనతో తీసుకు వెళ్ళాడు ఆంజనేయుడు. మారుతి మెచ్చిన, సీతా దేవికి నచ్చిన ఆ పండు రుచి అప్పటి నుంచి మరింత పెరిగింది.

. మంటల చిటచిటలు మండెడి ఎండలు

వెట్ట వడకు పిడచగటు్ట నోళ్ళు

వేడి సెగను పిండి వెన్నెల జేసెడి

పండు, నూజివీడు మావి పండు

ఆ. రసములు గలవు పలు రకము, బంగినపలి్ల,

చిక్కమునకు చిక్కు చక్కని  ఫల

ములు, ఇమాము పసదములు, పెక్కు రుచులీను

పండు, నూజివీడు మావి పండు

మండు వేసవి ఎండల తాకిడి తగ్గించే ఈ పండులో రకాలు అనేకము. చిన రసము, పెద్ద రసము, నల్ల రసము, తెల్ల రసము, బంగినపల్లి, జలాలు, ఇమాము పసందులు..ఇలా చెప్పుకుంటూ పోతే దానికంతే లేదు. ఒక దానిని మించిన రుచి మరొక దానికి. అలాగే దోర మామిడి కాయ ఎలా ఉంటుందంటే..

ఆ. లేత పసిమి కోక లే నడుము తొడుము

బిగువు మేని వగల పొగరు వగరు

తొలి వలపు తీపి పులుపు సంగమనమీ

పండు, నూజివీడు మావి పండు

పచ్చటి పట్టు పరికిణి, సన్నటి నడుము, తొలి యౌవనపు బిగువు  పొగరులతో కూడిన కన్నెపిల్లను బోలి ఉంటుంది. అదే పండిన మామిడి పండైతే..

. నౌరు పరువపు తావి, తాకిన విభునకై

విరహిణి వలువములు వీడి నటుల,

అవి కలయిక చేత మాగెనీ కమ్మని

పండు, నూజివీడు మావి పండు

ప్రియుని (ఇక్కడ సూర్యుని ) కలయిక చేత మాగిన పరువాలు కలిగి , ఆతని కోసము తాకినంతనే వలువలు జార్చుటకు సిద్దముగా ఉండే విరహిణి బోలి ఉంటుంది చక్కగా తయారైన నూజివీడు మామిడి పండు.

ఇని్న మాట లెందుకు.. తలుచుకున్నంతనే నా లాటి (కవి) పామరులలో కూడా కవిత్వము పుట్టించ గల గొప్పతనము ఈ కాయ సొంతము. ఇంకా ఆలస్యమెందుకు? వెళ్ళి ఆ పండు తినండి. లేనిచో మీ తల వేయి వక్కలు….ఈ కథ చదివారుగా పరవా లేదులేండి..మీకేమీ అవదు.



స్పందనలు

  1. baagundi

  2. మేము వీటినే చిన్నరసాలంటాం. మా నాన్నగారి ఉద్యోగరిత్యా మేము యే ఊర్లో ఉన్నా వేసవిలో ఇవి మాత్రం ప.గో.జి. నుంచి తప్పనిసరిగా తెప్పించాల్సిందే. ఇవి తప్ప వేరే రసాలు ముట్టుకునేవాళ్ళం కాదు మరి మేము. కోతపళ్ళు అయిన బంగినపళ్ళి(?) లాంటివి బాగానే తిన్నా, రసాలలో మాత్రం మాకు దీన్ని మించినది లేదు ఈ భూప్రపంచంలో అని ఫీలింగు.

  3. adbhutam,nuzvid mamidi inka thiyyaga vunnai,oka purpose vundhi anipisthondi,anjineyulu,ramudu,sita machindhi ante inka bavundhi.

  4. sweet as nuziveedu hima pasand.

  5. సురేష్ గారూ,

    భలే రాశారు.

    > లేకపోతే నూజివీడు వాళ్ళందరూ ఇంత మంచి వాళ్ళు, చక్కని వాళ్ళు ఎందుకు అవుతారు? 🙂

    మొత్తానికి నూజివీడు మామిడికి పురాణ ప్రశస్థి కలగజేశారు. బావుందండీ!

  6. మీ మామిడి పండు కథ బాగుంది. వీలుంటే ఓ బుట్టడు రసం పండ్లు పంపండి. జుర్రి పెడతాను.

    • ఆశ, దోశ, రసం, బంగినపళ్లి.. :-). మీరు మరో మూడు నెలలైనా ఆగాలి లేకపోతే నాకు లాగ (ఆహా నా పెళ్లి అంట లో కోటా మాదిరి) తలుచుకుంటూ ఏ ఆపిల్ పండునో లేకపోతే లోకల్ నాటు మామిడి కాయనో తినండి.

  7. నుజివిడు మమిడి గురించి ఎంతో చక్కగ విశ్లెషించి విపులంగా వివరించారు…ఆ పరిసర ప్రాంతలలో పెరిగినా కూడ నాకు తెలియని ….మమిడి పండు యొక్క పురణ విశిస్టతను చక్కగా ఇక్కడ క్రోడికరించడం ఎంతో అనందదాయకం….

  8. @శ్రీనివాస్ నీ అభిమానానికి ధన్యవాదాలు.


వ్యాఖ్యానించండి

వర్గాలు