వ్రాసినది: సురేష్ | ఫిబ్రవరి 20, 2010

Lightning Thief..మాయాబజార్.. MNIK..

థాకరేకు ఈ విషయము తెలిస్తే నాకు తప్పకుండా మరాటీ ఆనరరీ సిటిజెన్ షిప్ ఇస్తాడు. వాలంటైన్ డే గురించి పట్టించుకోకుండా(థాకరే నుంచి చప్పట్లు), ముప్పై మైళ్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, పక్క తియేటర్లో MNIK (మై నేమ్ ఈజ్ ఖాన్ ) సినిమా ఆడుతున్నా పటి్టంచుకోకుండా (బహిష్కరించి) మాయాబజార్ సినిమా చూసాము. మాతో పాటు మరో నలుగురు మిత్రులూ వారి కుటుంబాలు గూడా. వావ్!! ఆయనకు అంత కన్నా ఇంకా కావలిసినది ఏమున్నది?

ఈ బృహత్తు కార్యక్రమము చేపట్టడానికి నేను చాలానే శ్రమ పడాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఓ వారము రోజులు పైనే పట్టింది. ఇది బోరింగ్ బ్లాక్ అండ్ వైట్ సినిమా కాదు, అదీ కాకుండా ఆ ఫన్నీ ఫుడ్ సాంగ్కూడా ఉంది ఈ సినిమాలో అని మా అమ్మాయికి హైప్ ఇచ్చాను. అది కొంత వరుకు పని చేసింది. ఏదైనా సాధించాలను కున్నప్పుడు కొంచెము ఇచ్చి పుచ్చుకోవాలి అనే సూత్రాని్న మా అమా్మయితో బాగా వాడాను. చిరంజీవి సినిమాను కూడా ఎప్పుడూ నేను మొదటిరోజు మొదటాట చూడలేదు. అలాంటిది తన కోసము “Lightning thief” అనే ఓ గొప్ప ఆంగ్ల, విథలాచార్య సినిమా చూసాను. ఏ మాటకామాటే చెప్పు కోవాలి. ఆ సినిమా ఓ మాదిరిగా బాగానే ఉంది. నేను సినిమాలో ఎక్కడ నిద్ర పోతానో అని నాకు ముందే అందులో ఉండే గ్రీకు పౌరాణిక పాత్రలు, వాటి మద్య ఉండే సంబంధాలు అన్నీచక్కగా విడమరిచి చెప్పింది. ‘గ్రీకు ఇంద్రుడి (Zeus) వజ్రాయుధాన్ని ఎవడో అనామకుడెత్తుకు పోవటమేమిటి?’ లాంటి నా చొప్పదంటు ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానాలు చెప్పింది. “క్విడ్ ప్రో క్వోగా నేను (నిరసనల మధ్యన) బలరాముడెవరు, అభిమన్యుడికి తనకి సంబంధమేంటి, శశిరేఖను బావ ఎందుకు పెళ్లి చేసుకోవచ్చు లాంటి అనేక విషయాలు విడమరిచి చెప్పాను (అనుకున్నాను).

ఈ విధముగా మాంచి సన్నాహలతో మాయాబజార్ సినిమాకి వెళ్లాము. సినిమాహాలు షుమారుగా నిండటము చూసి ఆనందము వేసింది. తెలుగులోని అత్యద్భుతమైన చిత్రరాజాన్ని మొదటిసారి విడుదలైనప్పుడు చూసే అవకాశము లేకపోయినా ఇప్పుడైనా చూడగలుగుతున్నందుకు మామిత్రులందరికీ మహదానందమైనది. సినిమా బాగుంటుందా లేదా, రంగులు ఎబ్బెట్టుగా ఉంటాయా (లవకుశలో లాగా) లాంటి సందేహాలు ఉన్నాయి. పిల్లలలో కొంచెము అసహనము కనబడుతూనే ఉంది.

ఓకసారి సినిమా మొదలైనాక ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు మాయబజారు చూసినా ఆ అనుభవాలన్నీ ఈవర్ణభరితమైన కొత్త మాయాబజార్ ముందు దిగదుడుపే. మేలిమి బంగారానికి మరింత వన్నె వచ్చింది. తెరమీద మొదటి సారి కృష్ణుని చూసినప్పుడూ, ఘటోత్కచుడు పద్యము పాడుతూ ప్రవేశించినప్పుడూ, ఈలేయటము కూడా రాని నా అశక్తత మీద నాకే కోపము వచ్చింది. ఓ ఇద్దరు ముగ్గురు నుంచి ఈల సౌండ్ రావటము కొంతలో కొంత రిలీఫ్. పోతే ఈ సినిమా గురించి నా విశ్లేషణ :-

  1. ఈ సినిమాకి మీ భార్యను తీసుకెళ్లేట్టైతే ముందుగానే హెచ్చరిక. మొదటి రెండు పాటలు అయిపోయాక తీసుకెళ్లండి. ఎందుకు చెపుతున్నానో అర్థము చేసుకోండి. ఆ సీన్లలో ఆడవారు వేసుకున్న వడ్డణాలు, గొలుసులు (ఇంకా మరెన్నో నాకు తెలియని ఆభరణాలు), పట్టుచీరలు.. వామ్మో.. ఆ తరవాత మీ ఇష్టము.
  2. బలరాముడు పాత్ర ధారి గుమ్మడి, .ఎన్.అర్, ఎస్.వి.అర్ అద్భుతముగా ఉన్నారు.. కొత్త రంగులలో. వాళ్ల నటన మరింత సహజముగా అనిపించినది. ఛాయాదేవి మరెన్నో రెట్లు గడుసుగా (పాత్రోచితముగా) కనపడింది.
  3. రమణా రెడి్డ, రేలంగి పాత్రలు ఇంకా నవ్వు తెప్పించేట్టుగా అనిపించాయి. దానికి సాక్షము కేరింతలు కొడుతూ చూసిన మా మిత్రుల పిల్లలు.
  4. సావిత్రి నటన, రూపము అదుర్స్. క్లోజప్ షాట్లు కంటే కొంచెము దూరము నుంచి మరింత బాగుంది.
  5. సందేహానికి తావు లేకుండా, అరిసెలు, లడ్లు, బూరెలు, పులిహోర, పాయసము, కజ్జుకాయలు చక్కగా కనబడ్డాయి.. వివాహ భోజనంబు పాటలో. ఘటోత్కచుడు అంత హడావిడిగా ఆ భోజనము ఎందుకు తిన్నాడో ఇప్పుడు బాగా అర్థ మయ్యింది.
  6. బాక్ గ్రౌండ్ లో ఉండే నటులూ, ఎగష్ట్రాలూ మంచి మంచి రంగు బట్టలు వెయ్యటము మూలాన కొంచెము వాళ్లకు ప్రాముఖ్యత పెరిగినట్టు అనిపించినది.
  7. నాకు చాలా disappointing గా అనిపించినది మాత్రము.. నిస్సందేహముగా.. నా అబిమాన నటుని పాత్ర. శ్రీ కృష్ణుడు, నీల మేఘశ్యాముడు. కరక్టే. కానీ మరీ ఇంత నీలమా? చాలా అసహజముగా అనిపించినది. నాకు B&W కృష్ణుడే బాగున్నాడు.

టూకీగా.. మీరు గనక ఇది వరుకు మాయాబజారు సినిమా ఒకటి కంటే ఎక్కవ సారు్ల చూసిఉంటే (అంటే మీరు పంకాలైతే) ఎంత ప్రయాసలకోర్చి అయినా ఈ కలర్ వర్షన్ తప్పకుండా చూడాలి. నా మటుకు నేను, రంగుల పాతాళభైరవి, సీతారామకళ్యాణం, రంగులులేని లవకుశ కోసము ఎదురుచూస్తున్నాను.

కొసమెరుపు.. మా అమ్మాయికి కూడా ఈ సినిమా ఓ మాదిరిగా బాగానే నచ్చినది.


స్పందనలు

  1. సురేశ్,
    నేను కూడా లైట్ నింగ్ తీఫ్ చూసాను. పర్వాలేదు. ఒక సారి చూడవచ్చు. మా వాడు రిలీస్ అయిన రోజు ఫస్ట్ డే. ఫస్ట్ షో చూడాలని పట్టుబట్టాడు. పిల్లలంతా ఆ సినిమా కోసం బాగా ఎదురుచూసినట్లు వున్నారు.
    రంగుల మాయా బజార్ నేను చూడలేదు కాబట్టి ఏమీ చెప్పలేను. కానీ మరీ ఆడంగులు అంతారెమిటండీ…కాస్త ఆ పదం మార్చకూడదా?

    • ‘ఆడంగులు’ అనేది ఆక్షేపంచాల్సిన పదము అనుకోలేదు. మీ సలహా వలన మార్చాను.

  2. సందేహానికి తావు లేకుండా, అరిసెలు, లడ్లు, బూరెలు, పులిహోర, పాయసము, కజ్జుకాయలు చక్కగా కనబడ్డాయి.. వివాహ భోజనంబు పాటలో. ఘటోత్కచుడు అంత హడావిడిగా ఆ భోజనము ఎందుకు తిన్నాడో ఇప్పుడు బాగా అర్థ మయ్యింది.

    super!

  3. well done.
    మీరు చెప్పినట్టు, మిగతా క్లాసిక్సన్నిటికీ రంగులద్దటంతో బాటే లవకుశకి ఉన్నవి తుడిచెయ్యాలేమో 🙂

  4. మీ సప్త స్పందనలతో నేనూ ఏకీభవిస్తున్నాను.
    అదనంగా నన్ను నిరాశ పరచిన అంశం … ” చూపులు కలసిన శుభవేళ “, ” భళి భళి భళి దేవా ” అన్న పాటలు
    కలర్లో లేక పోవడం.

  5. @కొత్తపాళీ గారూ ధన్యవాదాలు.

    @ఆచార్యా, బాగా గుర్తుచేశారు. “చూపులు కలసిన శుభవేళ” పాట లేకపోవడము నిస్సందేహముగా లోటే.

  6. తెలుగు సినెమాకు అదీ పాత పౌరాణికానికి పిల్లల్ని తీసికెల్లడం ఇండియాలో కంటే అమెరికాలో కొంతలో కొంత తేలిక.
    అందుకణుగుణంగా వాతావరణం క్రియేట్ చేయగలుగుతున్నారు తలిదండ్రులు కొంత వయసు వరకు. ముదావహం.
    ఆ తరువాత ఎవరి టేస్ట్ వారిదే ననుకోండి..
    ఫణీంద్ర గారి మాటలు చదివే దాక పాటలు తీసివేశారని తెలియదు.?నిజంగా మాయాబజారులో ప్రతీ అంగుళం మహాధ్భుత ప్రక్రియ. ఆ చిత్ర రాజాన్ని నిర్మించిన కాల, మాన, సాంకేతిక, నేపధ్యాన్ని మనం ద్రుష్ఠిలో పెట్టుకోవాలి. అంతటి మహత్తర చిత్ర రాజం,మాయాబజార్. చక్కని అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు అభినందనలు……నూతక్కి

  7. @రాఘవేంద్రగారూ, మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు.

  8. మీరెందుకు మళ్ళీ రాయలేదు??


వ్యాఖ్యానించండి

వర్గాలు